టెస్టులు, వన్డేలు కొత్త కొత్తగా 2019 నుంచి లీగ్‌ పద్ధతిలో!

7

దుబాయ్‌: క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. అన్ని ఫార్మాట్లలో పోటీతత్వం పెంచేందుకు గాను టెస్టు, వన్డేల్లో లీగ్‌ పద్ధతి ప్రవేశపెట్టాలని, ప్రపంచ టీ20 కోసం ఫుట్‌బాల్‌ తరహాలో ప్రాంతీయ అర్హత టోర్నీలు నిర్వహించాలని ఐసీసీ ముఖ్య కార్యనిర్వాహక వర్గం (సీఈసీ) ప్రతిపాదించింది. ఐసీసీ బోర్డు ఆమోదం లభిస్తే.. 2019 నుంచి కొత్త లీగులు షురూ అవుతాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో సీఈసీ చేసిన ప్రతిపాదనలకు ఐసీసీ బోర్డు ఆమోదం లభించాల్సి ఉంది. శనివారం బోర్డు సమావేశం జరగనుంది. ఐతే కొత్త ఆర్థిక విధానంపై ఐసీసీ చర్చించనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు చర్చకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏప్రిల్‌లో వీటిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు.

లీగులు ఎలా..
టెస్టులో..: రెండేళ్ల వ్యవధిలో మొత్తం 12 జట్లు రెండు అంచెల లీగ్‌లో పోటీపడతాయి. జింబాబ్వే మినహా టెస్టు హోదా గల తొమ్మిది జట్లు ఒక గ్రూప్‌లో పోరాడతాయి. ఈ తొమ్మిది జట్లు రెండేళ్ల కాలంలో మిగతా జట్లతో ఇంటా.. బయటా సిరీస్‌ ఆడాల్సివుంటుంది. ఏదైనా కారణంతో సిరీస్‌ ఆడలేకపోతే పాయింట్లు కోల్పోవాల్సివుంటుంది. ఒక్కో సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లుండాలి.. పాయింట్లు ఎలా అన్నది ఇంకా నిర్ణయించలేదు. లీగ్‌తో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. మరోవైపు జింబాబ్వే మరో రెండు అసోసియేట్‌ దేశాలతో కలిసి మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్‌ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్‌ మ్యాచ్‌ నిర్వహించి విజేతను ప్రకటిస్తారు.

వన్డేల్లో..
13 జట్ల మధ్య మూడేళ్ల వ్యవధిలో వన్డే లీగ్‌ జరుగుతుంది. ప్రతి జట్టు ఇంటా బయటా సిరీస్‌ ఆడాల్సివుంటుంది. పది టెస్టు హోదా జట్లతో పాటు.. అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌.. ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ విజేత ఈ వన్డే లీగ్‌ బరిలో నిలిచే అవకాశముంది. లీగ్‌ ముగిసేసరికి తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.. ఆతిథ్య జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా ఐదు జట్లు ఇంకొన్ని అసోసియేట్‌ దేశాలతో కలిసి ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ ఆడతాయి. ఇక ప్రపంచ టీ20లో పోటీ కోసం.. ప్రాంతీయ అర్హత టోర్నీలు నిర్వహించాలని సీఈసీ ప్రతిపాదించింది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here