ఇక విశాలంగా.. చౌక ఇళ్లు! సామాన్య, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో..

9

హైదరాబాద్‌: కలవారు ఎంత మొత్తమైనా చెల్లించి ఇల్లు కొనుగోలు చేస్తున్నారు.. నిరుపేదలకు సర్కారే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తోంది.. ఎటొచ్చి .. సామాన్య, మధ్యతరగతి వర్గాలకే నగరంలో సొంతిల్లు ఏళ్లుగా కలగానే ఉంది. కొందరు కొనగల్గుతున్నా.. ఎక్కువ మందికి నిరాశే ఎదురవుతోంది. బడ్జెట్‌లో చౌక గృహాల నిర్మాణానికి మౌలిక హోదా ఇవ్వడంతో ఇకపై ఈ వర్గాలు కొనగలిగే ధరల్లో ఇళ్ల నిర్మాణం పెరుగుతుందని స్థిరాస్తి పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అందుబాటు గృహాల నిర్వచనాన్ని మార్చడంతో విశాలంగా చౌక ధరల ఇళ్లు నిర్మించేందుకు ఆస్కారం ఏర్పడిందంటున్నారు.

నిర్మాణ రంగానికి మౌలిక హోదా.. కొన్నేళ్లుగా స్థిరాస్తి సంఘాల డిమాండ్‌ ఇది. ఏటా బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడం.. షరామామూలుగా దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో పరిశ్రమ వర్గాలు నిరాశ చెందేవి. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళుతుండటంతో.. కనీసం చౌక గృహ నిర్మాణం వరకైనా మౌలిక హోదా ఇవ్వాలని స్థిరాస్తి సంఘాలు కోరాయి. అందుకు తగ్గట్టే ఈసారి బడ్జెట్‌లో హోదా ప్రకటన వెలువడటంతో నిర్మాణదారులు స్వాగతిస్తున్నారు. ఈ రంగం మొత్తానికి మౌలిక హోదా ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల ఉపసంహరణతో డీలా పడిన రియల్‌ మార్కెట్‌ .. బడ్జెట్‌లో మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇస్తున్న ప్రోత్సాహకాలతో మరింత వృద్ధిపథంలో పయనిస్తుందని భావిస్తున్నారు.

పెరగనున్న నిధుల లభ్యత.. నగరంలో చాలా వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం బుకింగ్స్‌ ఆధారంగా జరుగుతోంది. మార్కెట్‌ బాగలేకపోయినా.. ఆశించిన మేర కొనుగోళ్లు లేకపోయినా.. నిర్మాణ పురోగతిపై ప్రభావం పడుతోంది. బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకుందామంటే రెండు అంకెల్లో వడ్డీరేట్లతో అధిక భారం పడుతోందని బిల్డర్లు అంటున్నారు. మౌలిక హోదాతో బ్యాంకులు చౌక గృహాల నిర్మాణానికి రుణాలు తక్కువ వడ్డీరేట్లకే మంజూరు చేసే అవకాశం ఏర్పడింది. దీంతో ఈ విభాగానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్న చాలామంది నిర్మాణదారులు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

గడువు పెరగడం..
చౌక ఇళ్ల ప్రాజెక్ట్‌లను మూడేళ్లలో పూర్తిచేయాలనే నిబంధనను ఈసారి బడ్జెట్‌లో ఐదేళ్లకు పొడిగించారు. ఈ తరహా ఇళ్ల నిర్మాణంతో వచ్చే లాభాలపై ఆదాయపు పన్ను, సేవా పన్నుల మినహాయింపు వంటి ప్రయోజనాలు ఇదివరకే ఉన్నాయి. అయితే చౌక గృహాల విస్తీర్ణం 60 చ.మీ.గా నిర్వచించడంతో రెండు పడక గదులు మరీ ఇరుకుగా ఉంటున్నాయనే కొనుగోలుదారులు ఆసక్తిచూపడం లేదని బిల్డర్లు ముందుకొచ్చేవారు కాదు. ఇప్పుడీ విస్తీర్ణం పెరిగింది. చౌక ఇళ్లను మరింత విశాలంగా కట్టే అవకాశం ఉండటంతో వచ్చే ఐదేళ్లలో రూ.20 లక్షలు మొదలు రూ.30 లక్షల ధరల్లో ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టే సూచనలు ఉన్నాయని భావిస్తున్నారు. గ్రేటర్‌లో 22 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా.. అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు 11 లక్షలకుపైగా ఉన్నాయి.

వెసులుబాటు..
బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు బడ్జెట్‌లో కొంత ­రట లభించింది.

*సంయుక్త భాగస్వామ్య పద్ధతిలో చేపట్టే నిర్మాణాల్లో ఇదివరకు ఒప్పందం కాగానే మూలధన రాబడి పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది బిల్డర్లకు కొంత ఆర్థిక భారంగా ఉండేది. ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక చెల్లించే అవకాశాన్ని తాజా బడ్జెట్‌లో కల్పించారు.

*ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చిన దగ్గర నుంచి అక్కడ అద్దె విలువ ఆధారంగా ప్రస్తుతం పన్ను వసూలు చేస్తున్నారు. విక్రయం కాకపోయినా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పొంది.. విక్రయించకుండా ఉంటే ఏడాది వరకు పన్ను మినహాయింపు వెసులుబాటును కల్పించారు. తమ స్థలాన్ని అభివృద్ధికి ఇచ్చి.. వాటాకు వచ్చిన ఫ్లాట్లను వెంటనే అమ్ముకోవాల్సిన పనిలేకుండా.. మంచి ధర వచ్చేవరకు వేచిచూసేందుకు అవకాశం ఉంటుంది.

*స్థిరాస్తిని కొనుగోలు చేసి మూడేళ్ల తర్వాత అమ్మితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం దీర్ఘకాల మూలధన రాబడిగా పరిగణిస్తున్నారు. దీన్ని రెండేళ్లకు కుదించారు. పెట్టుబడి దృష్ట్యా కొనేవారికి ఇది ఎంతో ప్రయోజనం. ఇవన్నీ మార్కెట్‌లో కొనుగోళ్లు పెరగడానికి దోహదం చేస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

చిన్న నిర్మాణదారులకు ప్రోత్సాహం
– ఎస్‌.రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

మౌలిక హోదాతో ఎక్కువ మంది నిర్మాణదారులు అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఆరునెలల నుంచి ఏడాదిలో తక్కువ ధరల శ్రేణిలో చాలా కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయి. ఇప్పుడు కడుతున్న 1000 నుంచి 1200 చ.అడుగుల విస్తీర్ణం స్థానంలో 700 నుంచి 900 చ.అడుగుల లోపే నిర్మించడం ద్వారా ధరలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు సైతం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద.. రూ. 12 లక్షల వరకు 5.5 శాతం వడ్డీకే గృహరుణం లభిస్తుంది. చేతి నుంచి కొంత మొత్తం భరిస్తే సొంతిల్లును కొనుగోలు చేయవచ్చు. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా కేంద్రం పక్కా ప్రణాళికను బడ్జెట్‌లో ప్రకటించింది. చిన్నస్థాయి డెవలపర్లకు ఇది ప్రోత్సాహకరం.

ప్రాధాన్యాలు మారతాయి..
– రాంచంద్రారెడ్డి, గౌరవ కార్యదర్శి, క్రెడాయ్‌ తెలంగాణ

మనవాళ్లకు ఇల్లు విశాలంగా ఉంటే తప్ప నచ్చదు. అందుకే నిర్మాణదారులు ఎక్కువ విస్తీర్ణంలో ఉండే ఇళ్లను కట్టడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుబాటు ఇళ్లకు సంబంధించి ఇంటి విస్తీర్ణం ఇదివరకు 60 చ.మీటర్లు ప్లింత్‌ ఏరియా ఉండేది. ఇప్పుడు దీన్ని సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా మార్చడంతో సుమారు 900 చ.అడుగుల విస్తీర్ణం వరకు అందుబాటు ఇళ్లను నిర్మించుకునే సౌలభ్యం ఏర్పడింది. దీంతో బిల్డర్ల ప్రాధాన్యాలు మారనున్నాయి. కచ్చితంగా ఇది సామాన్య, దిగువ మధ్యతరగతి వారికి సొంతింటి కలను దగ్గర చేస్తుంది.

తక్కువ వడ్డీరేట్లతో పెరగనున్న డిమాండ్‌
– శిఖాశర్మ, ఎండీ, యాక్సిస్‌ బ్యాంకు

మౌలిక హోదాతో అందుబాటు ధరల్లో నిర్మాణాలు చేపట్టే సంస్థలకు తక్కువ వడ్డీకి బ్యాంకుల రుణాలు లభించనున్నాయి. దీంతో నిధుల లభ్యత పెరుగుతుంది. యాక్సిస్‌ బ్యాంకు 2014 నుంచి ఆశా హోంలోన్‌ కార్యక్రమాన్ని చేపట్టి రుణాలు ఇస్తోంది. జాతీయ గృహ నిర్మాణ సంస్థ రూ.20వేల కోట్లు గృహ రుణాలకు కేటాయించనుంది. వడ్డీరేట్లు తగ్గడంతో ..మరింత ఎక్కువ మంది గృహరుణాలతో ఇల్లు కొనుగోలు చేయడంతో నిర్మాణరంగ పరిశ్రమ అభివృద్ధి చెందనుంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here